Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలోని అన్ని రాష్ట్రాలకు మోడల్ కానున్న కాళేశ్వరం ప్రాజెక్టు : ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి అరవింద్

  • ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన 15వ ఫైనాన్స్ కమిషన్ బృందం
  • తాగు, సాగునీటి పథకాలలో తెలంగాణ అగ్రగామి
  • నిధుల వినియోగం తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన బృందం
దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పనులను క్షేత్ర స్థాయిలో బృందం సభ్యులు ఈరోజు పరిశీలించారు. అరవింద్ మెహతా వెంట తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ రావు, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమేయ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం, అరవింద్ మెహతా మీడియాతో మాట్లాడుతూ, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం, భారీ సాగునీటి కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మోడల్ కానున్నట్టు అభిప్రాయపడ్డారు. రైతులకు సాగునీరు, ప్రజలందరికీ సురక్షిత తాగునీరందించే ప్రభుత్వ సంకల్పం గొప్పదని ప్రశంసించారు. అతి తక్కువ వ్యవధిలో  ఇంత అద్భుతంగా పనులు జరగటం  సంతోషంగా ఉందని, మరో నాలుగు నెలల్లో 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులందరమూ ఇక్కడికి రానున్నట్టు చెప్పారు. సిద్ధిపేట సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 11 వ ప్యాకేజీ రంగనాయకి సాగర్ పనులు, అన్నారం బ్యారేజీ లను ఈ బృందం సందర్శించింది. రంగనాయకి సాగర్ టన్నెల్ లో పనులు జరిగే తీరుపై అరవింద్ మెహతా  సంతృప్తి వ్యక్తం చేశారు. సండ్లాపూర్లోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జోషీ, రామకృష్ణారావు ఆయనకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, దానికి అవసరమైన నిధులు, ఖర్చు వివరాలను తెలిపారు. రంగనాయక సాగర్ టన్నెల్ , కాలువల నిర్మాణం , ప్రాజెక్ట్  నిర్మాణం జరుగుతున్న పనుల గురించి ఆయన తెలుసుకున్నారు.  ఈ ప్రాజెక్టును షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే  వ్యవసాయం అభివృద్ధి  చెందుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమవుతుందని అరవింద్ మెహతా అభిప్రాయపడ్డారు.  ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్టు తెలిపారు. నిర్మాణాలు, ప్రణాళిక, వేగవంతంగా జరుగుతున్న పనుల తీరు తమను ఆకట్టుకున్నాయని, వచ్చే వానాకాలం నాటికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలు రాయి దాటుతుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పలు ప్రయోజనాలున్నాయని, 18 లక్షల  ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం తో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు ఇదని ప్రశంసించారు. సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే,  ప్రాజెక్ట్ వ్యయం పెరగదని అరవింద్ మెహతా అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్రాలలో నిధుల వినియోగంపై ఫైనాన్స్ కమిషన్ తనిఖీ లో భాగంగా ఈ బృందం తెలంగాణలో పర్యటిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారని చెప్పారు. రాష్ట్రం లో అభివృద్ధి కార్యక్రమాలను అత్యంత వేగంగా అమలు చేసేందుకే అప్పులు చేస్తున్నట్టు వివరించారు. మిగులు బడ్జెట్ తోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు.  
Telangana
karleswaram project

More Telugu News